: నిరసనలతో హోరెత్తిన అసెంబ్లీ.... ప్రారంభమైన వెంటనే వాయిదా
కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వెనువెంటనే వాయిదా పడ్డాయి. ఏపీలో కలకలం రేపిన కాల్ మనీ దందాపై చర్చకు అనుమతించాలని విపక్షం వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ సభ్యులు ప్రభుత్వం, సీఎం చంద్రబాబులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ప్రతిదాడి ప్రారంభించిన అధికార పక్షం టీడీపీ సభ్యులు కూడా కాల్ మనీతో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు. కాల్ మనీ నిందితుడొకరు జగన్ తో కలిసి దిగిన ఫొటోను ప్రదర్శించారు. ఈ సందర్శంగా ఇరు పక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. సీట్లలో కూర్చోవాలన్న స్పీకర్ అభ్యర్థనను విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.