: రెట్టింపు కానున్న యూఎస్ వీసా ఖరీదు... ఒబామాతో మాట్లాడానన్న నరేంద్ర మోదీ


భారత ఐటీ నిపుణుల అమెరికా కలలపై దెబ్బకొట్టేలా హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఫీజులను రెట్టింపు చేసే దిశగా అమెరికా ఆలోచిస్తూ ఉండటంపై ప్రధాని స్పందించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చిస్తున్నానని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ప్రతిపాదిత వీసా చార్జీల పెంపుపై భారత అనుమానాలను ఆయన ముందుంచినట్టు వెల్లడించారు. కాగా, ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో పాప్యులర్ అయిన హెచ్-1బీ వీసాలపై ప్రత్యేక ఫీజుగా 4,500 డాలర్లను వసూలు చేయాలని యూఎస్ కాంగ్రెస్ నిన్న నిర్ణయం తీసుకుంది. దీనిపై రేపు ప్రజాప్రతినిధులు ఓటింగ్ విధానంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందుతుందని నిపుణులు భావిస్తుండటంతో, ఐటీ కంపెనీల్లో దిగులు మొదలైంది. వీసా ఫీజుల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే సాలీనా బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఖజానాకు చేరుతాయని, వాటిని బయోమెట్రిక్ ఎంట్రీ, ఎగ్జిట్ ట్రాకింగ్ సిస్టమ్ కు, 9/11 హెల్త్ కేర్ చట్టం అమలుకు వినియోగించాలని యూఎస్ భావిస్తోంది. అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులను కలిగివున్న కంపెనీలు సగం మంది ఉద్యోగులను హెచ్-1బీ, ఎల్-1 వీసాల రూపంలో అమెరికాకు తెచ్చుకోవచ్చు. ఈ కంపెనీలు ఇకపై హెచ్-1బీ వీసాలకు 4 వేల డాలర్లు, ఎల్-1 వీసాలకు 4,500 డాలర్లు చెల్లించాల్సి వుంటుంది. ఈ బిల్లు అమలైతే ఇండియాకు ఏ విధంగా నష్టమన్న విషయాన్ని ఒబామాకు మోదీ ఫోన్ చేసి వివరించారు. డిసెంబర్ 12న పారిస్ సమావేశాల్లో, పర్యావరణ పరిరక్షణ దిశగా ఒబామా వ్యవహరించిన తీరును ఆయన కొనియాడినట్టు తెలుస్తోంది. ఆపై వీసా ఫీజుల విషయాన్ని ప్రస్తావించి, భారత కంపెనీలు నష్టపోయే నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News