: ప్రభుత్వం ఇంకెంత కాలం మూర్ఖంగా వ్యవహరిస్తుందో చూస్తా!: కాంగ్రెస్ నేత చిదంబరం
తన కుమారుడిపై ఇంకెంత కాలం ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందో చూస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చెందినదిగా భావిస్తున్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు. ‘చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్’తో కలిసి అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాసన్ హెల్త్ కేర్ కంపెనీలు విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడ్డాయనే ఆరోపణల ఆధారంగా ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒక ల్యాప్ టాప్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం మాట్లాడుతూ, ఈ సంస్థలతో తనకు, తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ అధికారులకు గతంలోనే తాను చెప్పానని అన్నారు. కాకపోతే, రెండు సంస్థలు తన మిత్రులకు సంబంధించినవని, మరో సంస్థ ఎవరిదో తనకు తెలియదని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కార్తీ పేర్కొన్నారు.