: డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారహితం: అంబటి
వడ్డీ వ్యాపారం తప్పు కాదని... అయితే, ఆ వ్యాపారం మితిమీరి పోయి మహిళలను చెరబట్టే స్థాయికి చేరుకోవడమే ఆందోళనకరమని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారం వేరు, కాల్ మనీ వ్యవహారం వేరు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని సూచించారు. కాల్ మనీ దారుణాల వెనుక ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా శిక్ష పడాల్సిందే అని అన్నారు. విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవు రద్దు చేసుకోవడాన్ని స్వాగతించిన అంబటి... ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి తన చిత్తశుద్ధిని సవాంగ్ నిరూపించుకోవాలని కోరారు. కాల్ మనీతో రాజకీయ నేతలకు సంబంధం లేదని డీజీపీ ప్రకటించడం బాధ్యతారహితమని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు అరెస్టైన తర్వాత కూడా రాజకీయ నేతలకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు అసమర్థ పాలన వల్లే ఏపీలో అరాచకాలు పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు.