: ఆ అరాచకాలకు అండదండ చంద్రబాబు, లోకేశే!: గంగాభవాని
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లపై ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి గంగాభవాని విమర్శలు గుప్పించారు. కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం తల దించుకునేలా ఉందని... చంద్రబాబు, లోకేశ్ ల అండతోనే టీడీపీ నేతలు కాల్ మనీ అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం వల్లే కాల్ మనీ ఆగడాలు శృతి మించాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి నిజాయతీగా వ్యవహరిస్తున్నందునే పోలీస్ అధికారి గౌతమ్ సవాంగ్ పై ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా దీనిపై ముఖ్యమంత్రి కాని, మంత్రులు కానీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. మహిళలకు అండగా ఉంటానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు... ఇప్పుడు అదే మహిళలను వ్యభిచారకూపంలోకి నెడుతున్న వారికి అండగా నిలబడ్డారని మండిపడ్డారు.