: కొండను తవ్వి ఎలుకను పట్టిన సీబీఐ... కేజ్రీవాల్ సీఎస్ ఇంట్లో 14 మద్యం సీసాలున్నాయని కేసు!


సోదాలు ఎందుకు చేస్తున్నామో చెప్పకుండా, నిన్న ఢిల్లీ సచివాలయం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ కార్యాలయం, ఇళ్లల్లో గంటల కొద్దీ సోదాలు జరిపిన సీబీఐ అధికారులు చివరకు పెట్టిన కేసేంటో తెలుసా? రాజేంద్ర కుమార్ ఇంట్లో 14 మద్యం సీసాలు లభించాయట. వాటిని ఇంట్లో ఉంచుకున్నందుకు రాజేంద్ర కుమార్ పై సీబీఐ కేసు పెట్టింది. వీటిల్లో కొన్ని విదేశీ మద్యం బాటిళ్లు ఉండటంతో అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై రాజేంద్రను అధికారులు మరోసారి ప్రశ్నించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ నిబంధనల కన్నా అధికంగా ఆయన వద్ద మద్యం నిల్వ ఉందని, దీనిపై మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కాగా, నిన్న ఆయన ఇంట రూ. 3 లక్షల వరకూ విదేశీ కరెన్సీ, రూ. 2.4 లక్షల వరకూ భారత కరెన్సీ లభించినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీనిపై మాత్రం ఎటువంటి కేసును పెట్టలేదని సమాచారం. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ఓ సైకోలా ప్రవర్తిస్తూ, తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ దాడులు చేయిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక సీబీఐ పెట్టిన మద్యం బాటిళ్ల కేసు తరువాత సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని నెటిజన్లు అంటున్నారు.

  • Loading...

More Telugu News