: ఉగ్ర బెదిరింపు ఒకటే... లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ దారులు మాత్రం వేరు!


అమెరికన్ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులను చంపేస్తామని బెదిరిస్తూ, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ అధికారులకు ఈ-మెయిల్స్ వచ్చాయి. యూఎస్ లో విద్యార్థులు అత్యధికంగా ఉండే ప్రాంతాలు ఇవే కావడం, ఇటీవలి ఉగ్రదాడుల నేపథ్యం అధికారులను ఉరుకులు పెట్టించాయి. అయితే, న్యూయార్క్ అధికారులు మాత్రం స్కూళ్లను తెరచే ఉంచాలని నిర్ణయించగా, లాస్ ఏంజిల్స్ మాత్రం సెలవు ప్రకటించింది. ఇది తప్పుడు ఈ-మెయిల్ అని, విద్యార్థులకు ఎటువంటి ప్రమాదమూ లేదని న్యూయార్క్ నగర అధికారులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో లాస్ ఏంజిల్స్ సూపరింటెండెంట్ రమాన్ కోర్టినెస్ మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. ఉగ్రదాడి నిజమైనా, కాకపోయినా, ప్రపంచం భయాందోళనల్లో ఉన్న వేళ, ఓ అధికారిగా తాను ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నీ పణంగా పెట్టలేనని ఆయన అన్నారు. ఈ సెలవుతో దాదాపు 6.40 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రుల దైనందిన జీవితానికి ఇబ్బంది కలిగినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు పాఠశాలలు తెరుచుకుంటాయని ప్రకటించారు. ఇక ఈమెయిల్స్ తప్పుడువేనని హౌస్ ఇంటెలిజన్స్ కమిటీ ప్రతినిధి ఆడమ్ బి స్కిఫ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News