: సివిల్ సర్వెంట్ల విచారణకు సర్కారీ అనుమతి అవసరం లేదు... ‘సుప్రీం’ కత్తిని బయటకు తీసిన సీబీఐ
సివిల్ సర్వెంట్ల హోదాలో సకల భోగాలు అనుభవిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల అధికారులను విచారించాలంటే మొన్నటిదాకా ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. రాష్ట్ర పరిధిలో సీఎం అనుమతించాల్సి ఉండగా, కేంద్ర పరిధిలో ప్రధాని మంత్రిత్వ కార్యాలయం పచ్చజెండా ఊపాల్సి ఉండేది. అయితే నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ పై ఎలాంటి అనుమతి లేకుండానే సీబీఐ దాడి చేసింది. సీఎం కార్యాలయంలోని రాజేంద్ర కుమార్ ఆఫీస్ ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని మరో 13 చోట్ల సోదాలు చేసింది. మరి సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన రాజేంద్ర కుమార్ ను ప్రశ్నించాలంటే, ఆయనకు సంబంధించి స్థలాల్లో సోదాలు చేయాలంటే సీఎంగా కేజ్రీవాల్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే, సీబీఐ అధికారులు కేజ్రీకి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. మాట మాత్రంగా కూడా ఆయనకు చెప్పకుండా ఏకంగా సీఎంఓలోని రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేశారు. మరి సీబీఐకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఓ ఏడాది వెనక్కెళితే... సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి ఓ కీలక తీర్పు చెప్పింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సివిల్ సర్వెంట్ల విచారణకు ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని సదరు తీర్పులో తేల్చిచెప్పింది. నిన్నటిదాకా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని సీబీఐ, నిన్న మాత్రం అవసరం వచ్చిన వెంటనే సదరు ‘సుప్రీం’ కత్తిని బయటకు తీసేసింది. కేజ్రీకి షాకిస్తూ ఆయనకు చెప్పకుండానే ఆయన కార్యాలయంలోనే సోదాలు చేసింది. ఇకపై దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ఏ సివిల్ సర్వెంట్ ను విచారించాలన్నా సీబీఐ ఎలాంటి అవాంతరాలు లేకుండానే ముందడుగు వేయనున్నట్లు నిన్నటి సోదాలతో అవినీతి అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.