: విజయవాడలో 40 కాల్ మనీ గ్యాంగ్ లు... ప్రతి గ్యాంగులోను బౌన్సర్లు: పోలీసుల వెల్లడి
విజయవాడలో 40 కాల్ మనీ గ్యాంగ్ లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించారు. ప్రతి కాల్ మనీ గ్యాంగ్ లో బౌన్సర్లతో పాటు 20 మంది సభ్యులు కూడా ఉన్నారు. డబ్బులివ్వని వారిని బౌన్సర్లు ఎత్తుకొచ్చి ఆస్తులు రాయించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, ఈ నలభై గ్యాంగ్ ల కదలికలపై విజయవాడ పోలీసులు నిఘా పెట్టారు. కాగా, ఇవాళ ఒక్కరోజే 10 గ్యాంగుల్లోని 57 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ మనీ గ్యాంగ్ ల సూత్రధారుల్లో అన్ని పార్టీల నేతల అనుచరులు ఉన్నారని, కొన్ని ప్రాంతాలను పంచుకుని ఈ వ్యాపారం చేస్తున్నారని పోలీసులు చెప్పారు. కాల్ మనీ మాఫియాపై ఈరోజు మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితులను పట్టుకునేందుకుగాను 3 బృందాలను ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.