: డబ్బులు ఆపేసిన సర్కార్!... పేదలకు ‘ఆరోగ్యశ్రీ’ దూరం?
పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకం ద్వారా అందించే సేవలను నిలిపివేస్తామని తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (టీహెచ్ఏఎన్ఏ) హెచ్చరిస్తోంది. సుమారు ఆరు నెలలకు సంబంధించి ‘ఆరోగ్యశ్రీ’ బకాయిలు రూ.200 కోట్లు తమకు చెల్లించాల్సి ఉందని టీహెచ్ఏఎన్ఏ అధికారులు అంటున్నారు. ఈ విషయమై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు (ఏహెచ్ సీటీ) అధికారులకు పలుసార్లు విన్నవించామని.. అయినప్పటికీ ప్రయోజనం లేదని టీహెచ్ఏఎన్ఏ అధికారులు వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిపివేసే విషయమై చర్చించిన తర్వాత ఒక తేదీని ప్రకటిస్తామని ఇటీవల నిజామాబాద్ లో జరిగిన టీహెచ్ఏఎన్ఏ సమావేశంలో పేర్కొన్నారు. ‘ఆరోగ్యశ్రీ’ బకాయిలు తమకు చెల్లించకపోవడంతో తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని టీహెచ్ఏఎన్ఏ అధ్యక్షుడు డి.నారాయణరావు పేర్కొన్నారు. ‘ఆరోగ్య శ్రీ’ బకాయిలు అంశమే కాకుండా ఇంకా పలు అంశాలపై టీహెచ్ఏఎన్ఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఆరోగ్య శ్రీ’ ఆపరేషన్లకు సంబంధించి చెల్లించే మొత్తంలో కోత విధిస్తుండటాన్ని టీహెచ్ఏఎన్ఏ ‘ఆరోగ్య శ్రీ’ విభాగం చైర్మన్ డాక్టరు. టి.నరసింగారెడ్డి ప్రశ్నించారు. ఈ పద్ధతిలో మార్పు రావాలని ఆయన కోరారు. ప్రైవేటు ఆసుపత్రుల వాళ్లు మూడు నెలలకొకసారి తప్పనిసరిగా హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలంటూ ఏహెచ్ సీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసిందని, ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకని, వ్యయప్రయాసల కోర్చి ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది వెళుతున్నారని అన్నారు. కాగా, టీహెచ్ఏఎన్ఏకు చెల్లించాల్సిన ‘ఆరోగ్య శ్రీ’ బకాయిలపై ఏహెచ్ సీటీ చీఫ్ మెడికల్ ఆడిటర్ గోవర్థన్ రెడ్డిని వివరణ కోరగా, ఇటీవల జరిగిన టీహెచ్ఏఎన్ఏ సమావేశంలో ఏ ఒక్కరూ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సుమారు రూ.50 కోట్ల వరకు తాము చెల్లించామని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనను టీహెచ్ఏఎన్ఏ ఆఫీసు బేరర్లు ఖండించారు.