: రైల్వే శాఖకు షాక్... తీవ్ర గాయాలతోనే చిన్నారి మరణమన్న పోస్టుమార్టం
ఢిల్లీలోని షాకూర్ బస్తీలో కూల్చివేతల కారణంగా చిన్నారి మరణించలేదని వాదిస్తూ వచ్చిన రైల్వే శాఖకు షాక్ తగిలింది. ఈ ఘటనలో మరణించిన చిన్నారి తలకు బలమైన గాయమైందని, నాలుగు పక్కటెముకలు విరిగాయని పోస్టుమార్టం నివేదికలో డాక్టర్లు వెల్లడించారు. శరీరం లోపల తీవ్ర రక్తస్రావం అయిందని, ఛాతీ వెలుపల రక్తం కారిందని డాక్టర్లు తెలిపారు. ఇక నిన్నటి వరకూ, చిన్నారి ముందే మరణించిందని, కూల్చివేతలకూ, దీనికి సంబంధం లేదని ప్రకటించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు పోస్టుమార్టం నివేదికపై ఏమంటారో చూడాల్సివుంది. కాగా, కూల్చివేతలను ఢిల్లీ హైకోర్టు సైతం ఆక్షేపించింది. రాజధానిలో అత్యంత చలిగాలులు వీస్తున్న సమయంలో పేదలకు నిలువ నీడ లేకుండా చేయడంపై సీరియస్ అయింది. కూల్చివేతల్లో పాల్గొన్న అధికారులకు కోర్టు ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.