: రాజ్యసభలో ఘర్షణకు దారితీసిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వ్యవహారం
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతి ప్రసాద్ రజ్ కోవా వ్యవహారం రాజ్యసభలో ఈరోజు ఘర్షణకు దారి తీసింది. బీజేపీ నియమిత గవర్నర్ అయిన జ్యోతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈయన పాలన బ్రిటీష్ పాలన కంటే దారుణంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. రాష్ట్ర సీఎంకు కూడా చెప్పకుండా, అప్పటికే ఖరారైన షెడ్యూల్ ని కాదని, అసెంబ్లీ సమావేశాలను ముందుగా నిర్వహించాలని గవర్నర్ ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. అంతేగాక, ఆ రాష్ట్ర స్పీకర్ ను తొలగించాలన్న గవర్నర్ నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో విపక్ష, అధికార సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకు రావడంతో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సభను వాయిదా వేశారు.