: చంద్రబాబును పొగుడుతూనే, రేవంత్ పై ఫైర్ అయిన టీఆర్ఎస్ ఎంపీ
విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి టీఆర్ఎస్ నేతగా, ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొందిన నేత బాల్క సుమన్. రాజకీయల్లో ఇప్పుడిప్పుడే తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుమన్... విపక్షాలపై విరుచుకుపడటంలో మాత్రం సీనియర్ నేతలకు ఏ మాత్రం తక్కువ కాదు. తాజాగా రేవంత్ రెడ్డిపై ఆయన మరోమారు విరుచుకుపడ్డారు. జైలులో గడిపి వచ్చిన తర్వాత కూడా రేవంత్ తన పద్ధతిని మార్చుకోలేదని... ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలవకపోయినా తప్పుబడతారు... ఇప్పుడు కలసి అనేక విషయాలపై చర్చించి, సమస్యల సాధన కోసం ప్రయత్నిస్తున్నా విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిరాశలో కూరుకుపోయారని అన్నారు. చంద్రబాబు, కేసీఆర్ ల కలయిక రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా మంచిదని బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ తో కలసి విజయవాడ వెళ్లి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మొదటి సారి తాను విజయవాడ వెళ్లానని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన విందు చాలా బాగుందని అన్నారు. కృష్ణా జలాలపై కలసికట్టుగా పోరాడాలని ఇరువురు ముఖ్యమంత్రులు భావించారని... ఇది శుభపరిణామమని చెప్పారు.