: ఎమ్మార్పీ ఎక్కడ?.. మల్టీ ప్లెక్సుల సిని‘మాయే’!


సినిమా చూసేందుకని హైదరాబాద్ లోని థియేటర్లకు, మల్టీ ప్లెక్స్ లకు వెళ్లే ప్రేక్షకులకు చిర్రెత్తుతోంది. ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం.. వారు చూసిన సినిమా బాగుండకపోవడం వల్ల కాదు.. అక్కడ విక్రయించే ఆహార పదార్థాల ధరలను చూసి! సినిమా టిక్కెట్ ధర కంటే స్నాక్స్ ధర ఎక్కువగా ఉంటోందనడం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఇరానీ హోటల్లోని ఆలూ సమోసా రూ.10. అదే సమోసా థియేటర్లలో అయితే రూ.20. మరి, మల్టీ ప్లెక్స్ లో అయితే రూ.30 నుంచి రూ.50 మధ్య ఎంతైనా ఉండవచ్చు. కేవలం ఆలూ సమోసా ఒక్కటే కాదు వాటర్ బాటిల్, కాఫీ, కూల్ డ్రింక్స్, స్వీట్ కార్న్, బేకరీ ఐటెమ్స్, పాప్ కార్న్, సాండ్ విచ్ ఇట్లా ప్రతి దాని ధరలో భారీ మార్పు ఉంటుంది. చివరకు, పార్కింగ్ స్థలాల్లోనూ ఇదే తీరు కొనసాగుతోంది. ఎంఆర్పీ రేట్లకు ఆయా తిను బండారాలను థియేటర్లలో, మల్టీ ప్లెక్స్ లలో విక్రయించడం కనాకష్టంగా ఉంది. ఇటీవల విడుదలైన ఒక ప్రముఖ హీరో సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు (పేరు చెప్పడానికి నిరాకరించాడు) మాట్లాడుతూ, ఆ థియేటర్లో స్వీట్ కార్న్ రూ. 200 తీసుకున్నాడని.. ఇదేమిటని ప్రశ్నిస్తే, దూషించే విధంగా మాట్లాడాడని పేర్కొన్నాడు. పార్కింగ్ ఫీజు విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని అన్నాడు. కాగా, ఈ విషయమై థియేటర్ల యాజమాన్యం మాట్లాడుతూ, థియేటర్లలోని ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేసుకునే వారికి తాము స్థలం కేటాయిస్తామే తప్పా, వాటి ధరలతో తమకు సంబంధం లేదని అన్నారు. ‘థియేటర్లలో, మల్టీ ప్లెక్స్ లలో విక్రయించే తినుబండారాలపై, పార్కింగ్ ఛార్జీలపై నిఘా వేసేందుదకు ఒక ప్రత్యేకమైన శాఖ లేకపోవడమే ఇందుకు కారణము’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్ సీసీ) అధ్యక్షుడు పి.రామమోహన్ రావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News