: బాంబులు, పేలుడు పదార్థాల పైన జబల్ పూర్ నగరం!
ఏ చిన్న పొరపాటు జరిగినా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నగరం సమాధి అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కార్గిల్ యుద్ధం సమయంలో పేలని, తిరస్కరించిన బాంబులన్నిటినీ ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భూగర్భంలో పాతి పెట్టారు. వీటిలో లక్షకుపైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్ 70, బీఎంపీ 2 షెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. దానికి దగ్గర్లోనే ఉన్న కార్గిల్ పేలుడు పదార్థాలను ఉంచిన మ్యాగజీన్ ఎఫ్12 ప్రాంతం మరింత ప్రమాదకరమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రష్యా ఎగుమతి సంస్థ రోసోబోరోన్ ఎక్స్ పోర్ట్ సంస్థ ఎగుమతి చేసిన 4 వేల కిలోల ఆర్డీఎక్స్ 'పేలుడు నాణ్యతా పరీక్ష'లో విఫలం కావడంతో దానిని జబల్ పూర్ లో భూగర్భంలో దాచారు. ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి ఉన్న ప్రదేశంలో ఎలాంటి పేలుడు జరిపినా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నగరం మొత్తం సజీవ సమాధికావాల్సిందే. ఈ విషయంలో స్థానికులు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదంటూ వారంతా ఆందోళన చెందుతున్నారు.