: కాల్ మనీ వ్యవహారంపై చంద్రబాబుకు జగన్ లేఖ
విజయవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. విజయవాడ నగరం హీనమైన, ఘోరమైన నేరాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. కాల్ మనీ వ్యవహారాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే తెరవెనుక ఉండి నడిపించారని, బాధ్యులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని లేఖలో డిమాండ్ చేశారు. కాల్ మనీ వ్యవహారాన్ని నీరుగార్చేందుకే ఇతర పార్టీల నేతలపై కేసులు నమోదు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. కాల్ మనీ పేరిట వసూలు చేసిన ప్రతి పైసాను బాధితులకు తిరిగివ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.