: ఏసీబీ కోర్టులో లొంగిపోయిన అంబర్ పేట తహశీల్దార్!
లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబర్ పేట తహశీల్దర్ సంధ్యారాణి ఏసీబీ కోర్టులో ఈరోజు లొంగిపోయారు. దీంతో ఈ నెల 28 వరకు ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అనంతరం ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, సంధ్యారాణిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ, తనను కావాలనే ఈ కేసులో ల్యాండ్ మాఫియా ఇరికించిందని, అక్రమార్కులపై దాడి చేసిన కారణంగానే తనపై కక్ష సాధిస్తున్నారని ఆమె పేర్కొంది. తాను ఎవరి నుంచి లంచం తీసుకోలేదని, న్యాయపరంగా తేల్చుకుంటానని సంధ్యారాణి పేర్కొంది. కాగా, మూడు రోజుల క్రితం రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ తమ్ముడు నాగేశ్వరరావు ఏసీబీకీ చిక్కిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఆమె పరారై, చివరికి ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోయింది.