: మీడియాలో భాష, ఉచ్చారణ మెరుగుపరుస్తాము: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వాసుదేవ దీక్షితులు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలోని సమాచార భవన్ లో పలువురు అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసార మాధ్యమాల్లో భాష, ఉచ్చారణను మెరుగుపరిచేందుకు అవసరమైన కార్యక్రమాలను ప్రెస్ అకాడమీ తరపున చేపట్టనున్నట్లు చెప్పారు. వార్తలు రాయడం వల్ల కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడే పద్ధతి వల్ల కానీ, ప్రస్తుతం మాట పడుతున్నామని, దీనికి అందరూ బాధ్యులు కారని అన్నారు. ఎవరో కొద్ది మంది కారణంగా అందరూ మాట పడాల్సిన పరిస్థితి దాపురించిందని, దీని నుంచి బయటపడాలని దీక్షితులు సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీనియర్ పాత్రికేయులు వరదాచారి, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేంద్ర సహా పలువురు హాజరయ్యారు.