: సంచలనం... తాష్కెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రితో నేతాజీ ఉన్న ఫోటో... నిర్ధారించిన ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీ!
నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణించాడని భావించిన 20 సంవత్సరాల తరువాత కూడా ఆయన బతికే ఉన్నారనడానికి తొలిసారిగా ఓ ఫోటో సాక్ష్యం లభించింది. భారత్, పాక్ శాంతి చర్చల్లో భాగంగా, 1966లో తాష్కెంట్ ఒప్పందం కుదిరిన సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోసేనని బ్రిటన్ ఫోరెన్సిక్ నిపుణుడు నీల్ మిల్లర్ అంటున్నారు. ఆనాడు బ్రిటన్ తీసిన వీడియోలు, కెంట్ సంస్థ, రష్యా తీసిన చిత్రాలు, లాహోర్ లోని చుగాతై మ్యూజియం నుంచి సేకరించిన చిత్రాలను అత్యాధునిక ఫేస్ మ్యాపింగ్ సాంకేతికత ఆధారంగా విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించినట్టు నీల్ వెల్లడించారు. దాదాపు నెల రోజుల పాటు విశ్లేషించి తయారు చేసిన తన 62 పేజీల నివేదికను నీల్ గత నెలలో సమర్పించారు. శాస్త్రితో పాటు ఉన్న వ్యక్తి కళ్లు, చెవులు, నుదురు, ముక్కు, పెదాలు, గడ్డం తదితరాలు నేతాజీ పోలికలకు సరిపోయాయని, తెలిపారు. తాష్కెంట్ ఒప్పంద ఫోటోలో ఉన్న వ్యక్తి నేతాజీ అయి ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు. కాగా, తాష్కెంట్ లో జనవరి 11, 1966న శాస్త్రి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక్కడున్న చిత్రంలో రౌండ్ లో ఉన్న వ్యక్తి నేతాజీనే అని నీల్ ఖరారు చేస్తున్నారు.