: బెజవాడలో నేడు దక్షిణాది రాష్ట్రాల సదస్సు... చంద్రబాబు మినహా అంతా డుమ్మానే!
నవ్యాంధ్ర పొలిటికల్ రాజధాని విజయవాడలో నేడు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు హాజరుకావాల్సి ఉంది. నిన్న తిరుమల వెంకన్న దర్శనం నిమిత్తం ఏపీకి వచ్చిన రాజ్ నాథ్ సింగ్ నిన్న రాత్రికే విజయవాడ చేరుకున్నారు. నేటి భేటీ కోసం ఆయన రాత్రి బెజవాడలోనే బస చేశారు. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా విజయవాడలోనే ఉన్నారు. నేటి ప్రాంతీయ మండలి భేటీకి ఆయన దాదాపుగా సిద్ధమైపోయారు. అయితే చంద్రబాబు మినహా ఏ ఒక్క రాష్ట్రానికి చెందిన సీఎం కూడా ఈ సమావేశానికి రావడం లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కార్యక్రమాల కారణంగా తన బదులు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు నాయిని నర్సింహారెడ్డిని పంపుతున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన మూడు రాష్ట్రాల సీఎంలు కూడా తమ కేబినెట్ లోని కీలక మంత్రులను సమావేశానికి పంపుతూ తాము మాత్రం డుమ్మా కొడుతున్నారు. ప్రాంతీయ సహకారంపై కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ మండలిని మరింత బలోపేతం చేద్దామన్న కేంద్రం చర్యలు సీఎంల వైఖరి కారణంగా కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు.