: చలిమంటకు గుడిసె దగ్ధం... తల్లీపిల్లలు సజీవదహనం!


చలి కాచుకునేందుకని కట్టె మొద్దులతో వేసుకున్న మంట కారణంగా వారి గుడిసె తగలబడటంతో తల్లీపిల్లలు సజీవదహనమయ్యారు. ఈ విషాద సంఘటన పాకిస్థాన్ సింథ్ ప్రావిన్స్ లో గురువారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. దాదు జిల్లాలోని గోరఖ్ కొండ ప్రాంతంలో ఓ పేద కుటుంబం నివసిస్తోంది. చలి తీవ్రత విపరీతంగా ఉండటంతో గుడిసెలో వేసిన నెగడులో చలి కాచుకుంటున్నారు. ఉన్నట్టుండి, నెగడులోని నిప్పురవ్వలు పైకి లేవడం.. గుడిసెకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో గుడిసె పూర్తిగా దగ్ధమై పోవడంతో ఈ దారుణం జరిగిందని పోలీసు అధికారి అష్రాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సంఘటనలో తల్లి, ఏడుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. పిల్లల తండ్రి మాత్రం తీవ్రమైన గాయాలతో బతికి బయటపడ్డాడు. అయితే, ప్రస్తుతం అతను స్పృహలో లేడని ఆయన చెప్పారు. కాగా, శీతాకాలంలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా ఇక్కడ జరుగుతుంటాయని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ ప్రాంతంలో నివసిస్తుంటారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. సింథ్ ప్రావిన్స్ లోని చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గోరఖ్ కొండలు మొదటి వరుసలో ఉంటాయన్నారు.

  • Loading...

More Telugu News