: నన్ను నిత్యం చావకొట్టేవారు: ‘బంగ్లా’ క్రికెటర్ పై బాలిక ఆరోపణలు
తనను వేధించారంటూ బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై ఒక బాలిక ఫిర్యాదు చేసింది. షాదత్ ఇంట్లో పనిచేసే ఆ బాలిక పేరు మహఫుజా అక్తర్. ముద్దు పేరు హ్యాపీ, వయస్సు పదకొండు సంవత్సరాలు. హ్యాపీ సంరక్షణ బాధ్యతలను ఆమె అమ్మమ్మ చూసుకుంటుంది. షాదత్ ఇంట్లో హ్యాపీని పనికి కుదిర్చింది ఆమె అమ్మమ్మే. అయితే, షాదత్ కుటుంబ సభ్యులు కర్రలతో, వంట సామగ్రితో నిత్యం తనను చావగొట్టేవారని ఆ బాలిక పేర్కొంది. ఈ బాధ భరించలేక ఒక రోజున ఆ ఇంట్లో నుంచి పారిపోయానని చెప్పింది. హ్యాపీ ముఖంపై గాయాల ఆనవాళ్లే కాకుండా, ఒక కన్ను పూర్తిగా వాచిపోయి ఉంది. ఆ బాలికను గమనించిన ఒక జర్నలిస్టు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాడు. ఈ విషయం బాలల హక్కుల సంఘాలకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. ప్రస్తుతం హ్యాపీ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంది. కాగా, క్రికెటర్ షాదత్, ఆయన భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.