: ఈ నెల 13న దిలీప్ కుమార్ నివాసంలోనే ఆయనకు పద్మ విభూషణ్ ప్రదానం
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు ఈ నెల 13న పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారని దగ్గరి సన్నిహితుడు ఉదయ్ తార నాయర్ తెలిపారు. "ముంబైలోని ఆయన నివాసంలో దిలీప్ కుమార్ కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా వచ్చి అవార్డును ప్రదానం చేస్తారు" అని నాయర్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అనారోగ్యం కారణంగా దిలీప్ ఢిల్లీ వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఇంటిలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ నాథ్ అవార్డు ఇస్తున్నారు. ఈ ప్రఖ్యాత నటుడు నేడు 93వ పడిలోకి అడుగుపెట్టారు. చెన్నై భారీ వరదల కారణంగా తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారు.