: గడువులోగా పైకోర్టుకు వెళతా: జైలు శిక్ష పడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పటాన్ చెరు మండలం పరిధి పాశమైలారంలోని వెర్సా టైల్స్ పరిశ్రమ ప్యాకింగ్ విభాగంలో చనిపోయిన ఓ కార్మికుడి వ్యవహారంలో ఆ పరిశ్రమ యజమానిని దూషించి, అతనితో దౌర్జన్యంగా చెక్కు రాయించిన కేసులో ఈ శిక్ష పడింది. తాజాగా కోర్టు తీర్పుపై ఎమ్మెల్యే స్పందిస్తూ, కోర్టు తీర్పును తాను గౌరవిస్తానన్నారు. కోర్టు ఇచ్చిన మూడు రోజుల గడువులోగా పైకోర్టుకు వెళతానని చెప్పారు. కార్మికుడికి ఇచ్చిన చెక్కును ఎగ్గొట్టేందుకే పరిశ్రమ యజమాని తనపై కేసు పెట్టాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం కోరితేనే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పరిశ్రమకు వెళ్లి నష్టపరిహారం ఇప్పించానని చెప్పారు.