: ‘గిడ్డి’ వ్యాఖ్యలపై ‘పీతల’ ఆగ్రహం... చర్యలు తీసుకుంటామని ప్రకటన
బాక్సైట్ జోలికొస్తే తల నరుకుతామంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై పరుష వ్యాఖ్యలు చేసిన వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై టీడీపీ మహిళా నేత, ఏపీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె గిడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం హోదాలో ఉన్న నేతపై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం సరికాదని పీతల వ్యాఖ్యానించారు. సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గిడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతుల జారీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే మొదలైందని సుజాత చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదని ఆమె విపక్ష ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేశారు.