: మద్య నిషేధం విధించడం అసాధ్యం: డొక్కా
వైకాపా అధినేత జగన్ పై టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు అధ్యయనం చేసి మాట్లాడాలని... నోటికి ఏది వస్తే అది మాట్లాడటం తగదని సూచించారు. టీడీపీ మద్య నిషేధాన్ని అమలు చేయాలని, లేదంటే వైకాపా అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తామని జగన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, డొక్కా ఈ విధంగా స్పందించారు. ఏపీకి చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల్లో మద్యం లభిస్తున్నప్పుడు... ఏపీలో నిషేధం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గతంలో మద్య నిషేధం విధించినప్పుడు ఎదురైన అనుభవాలను అధ్యయనం చేయాలని, ఆ తర్వాత మాట్లాడాలని చెప్పారు. జగన్ మద్య నిషేధ ప్రకటన అనాలోచితమని అన్నారు. వేరే కార్యక్రమాలు లేక పోవడం వల్లే జగన్ ఓదార్పు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.