: బీజింగ్ లా ఢిల్లీ వాతావరణం మారితే... నెలంతా సెలవులే!
చైనా రాజధాని బీజింగ్ లో కాలుష్యం పరిమితులను దాటి ప్రజల ప్రాణాలను హరించే స్థితికి చేరిన వేళ, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగ పనులకు ఆ దేశ ప్రభుత్వం కొంత విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక భారత రాజధాని ఢిల్లీలో అదే పరిస్థితి ఏర్పడితే, నెలంతా స్కూళ్లు, ఫ్యాక్టరీలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ పీస్ ఇండియా విశ్లేషణ ప్రకారం, ఢిల్లీలో వాయు నాణ్యత, ప్రస్తుతం బీజింగ్ లో తగ్గినంత స్థాయికి చేరితే నవంబర్ నెలలో ఉన్న 30 రోజుల్లో 29 రోజుల పాటు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) గణాంకాలను, ప్రస్తుత వాయు కాలుష్యాన్ని, చైనాలో వాయు కాలుష్యాన్ని పరిశీలించి గ్రీన్ పీస్ ఈ వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్, నవంబర్ మధ్య 91 రోజుల్లో 33 సార్లు ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిందని, ఇదే సమయంలో లక్నోలో 40 సార్లు కాలుష్యం పెరిగిందని, ఢిల్లీతో పాటు మరిన్ని నగరాల్లో ప్రమాదం పెరుగుతోందని హెచ్చరించింది. ఢిల్లీలో నెలలో 29 రోజులు, ముజఫరాపూర్ లో 26 రోజులు, వారణాసిలో 23 రోజులు, పాట్నాలో 22 రోజులు, కాన్పూర్, ఫరీదాబాద్ లలో 21 రోజులు వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిని దాటిందని వెల్లడించింది.