: సల్మాన్ ఖాన్ ను వదలం: మహారాష్ట్ర సీఎం


హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికి నిర్దోషిగా బయటపడ్డప్పటికీ, సల్మాన్ ఖాన్ కు పూర్తిగా కష్టాలు తప్పినట్టు కాదు. ఈ కేసులో మరోసారి అపీలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. తామింకా తీర్పు కాపీని చూడలేదని, తీర్పును పరిశీలించిన తరువాత ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై న్యాయ నిపుణుల సలహా కోరనున్నట్టు తెలిపారు. కాగా, ఈ కేసులో తమకు అన్యాయం జరిగిందని బాధితుడు అబ్దుల్లా వాపోయాడు. పై కోర్టుకు వెళతారా? అని మీడియా ప్రశ్నించగా, కోర్టుల్లో అపీలు చేసుకుంటూ తిరిగేంత డబ్బేవుంటే, తాము ఫుట్ పాత్ లపై ఎందుకు నిద్రిస్తామని ప్రశ్నించాడు. తాము శిక్ష కన్నా నష్ట పరిహారాన్నే కోరుతున్నామని అన్నాడు. కాగా, సల్మాన్ నిర్దోషిత్వం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. పలువురు నిర్మాతలు, హీరో హీరోయిన్లు సల్మాన్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News