: కాలగతిలోకి 2జీ ఫోన్లు... నిలిపివేయనున్న శాంసంగ్, మైక్రోమ్యాక్స్!


త్వరలోనే 2జీ తరంగాలపై పనిచేసే ఫోన్లు కనుమరుగు కానున్నాయి. ఇప్పటికే 3జీ, 4జీ ఫోన్లు స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి అన్నిరకాల ధరల్లో వెల్లువలా దూసుకొస్తున్న వేళ, ఇక 2జీ ఫోన్లను నిలిపివేయాలని ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థలు భావిస్తున్నాయి. మరింతవేగంగా పనిచేసే 3జి, 4జీ ఫోన్లపై దృష్టి నిలిపి, 2జీ సెగ్మెంట్ నుంచి విరమించుకోవాలని శాంసంగ్, మైక్రోమ్యాక్స్ తదితర సంస్థలు యోచిస్తున్నాయి. కేవలం రూ. 4 వేల ధరలో రిలయన్స్ జియో 4జీ ఫోన్ ను అందుబాటులోకి తెస్తున్న వేళ, ఇక 2జీ విక్రయాలు ఏమంతగా సాగవన్నది ఈ కంపెనీల అభిమతం. "మేము ఇకపై 4జీ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ప్రస్తుతం 14 మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తున్నాం. మార్చి నాటికి మరో 6 కొత్త మోడళ్లను విడుదల చేస్తాం" అని మైక్రోమ్యాక్స్ సీఈఓ వినీత్ తనేజా వ్యాఖ్యానించారు. ఇక శాంసంగ్ తో పాటు మరిన్ని సంస్థలు 2జీ ఫోన్లను నిలిపివేయనున్నాయని, ఈ మేరకు తమకు సమాచారం ఉందని, దేశవ్యాప్తంగా మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ నిర్వహిస్తున్న సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వివరించారు. ఇక గత సంవత్సరం రూ. 3,300 వద్ద ఉన్న 2జీ ఫోన్ ధరలు ఈ సంవత్సరం రూ. 1,750కి తగ్గగా, రూ. 5 వేల వరకూ ఉన్న 3జీ ఫోన్ల ధర రూ. 1,950కి, రూ. 10 వేల వరకూ ఉన్న 4జీ ఫోన్ల ధర రూ. 5 వేలకూ తగ్గాయి. 2జీ, 3జీ ఫోన్ల మధ్య ధరల వ్యత్యాసం వందల్లోకి రావడంతో కస్టమర్లు సైతం 3జీ ఫోన్ల వైపు నడుస్తున్నారు. ఇక సమీప భవిష్యత్తులో 2జీ ఫోన్లు పూర్తిగా మార్కెట్ నుంచి కనుమరుగు అవుతాయనే చెప్పచ్చు.

  • Loading...

More Telugu News