: డొనాల్డ్ ట్రంప్ ను బ్రిటన్ లోకి రానీయకుండా బహిష్కరించండి: పార్లమెంటుకు లక్ష మంది పిటిషన్
ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ ను బ్రిటన్ లోకి రానీయకుండా బహిష్కరించాలని కోరుతూ, దాదాపు లక్ష మంది ప్రజలు సంతకాలు చేసి బ్రిటన్ పార్లమెంటుకు పంపారు. 'బ్లాక్ డొనాల్డ్ జే ట్రంప్ ఫ్రం యూకే ఎంట్రీ' అనే టైటిల్ తో వచ్చిన ఈ పిటిషన్ పై పార్లమెంటుపై చర్చ సాగించాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురిని బ్రిటన్ లో కాలుమోపకుండా నిషేధించారని గుర్తు చేసిన ఈ పిటిషన్, అదే సూత్రాన్ని డొనాల్డ్ కూ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తోంది. ఆయన ప్రవర్తన, వ్యాఖ్యలు ఎంతమాత్రమూ సముచితం కాదని, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. కాగా, రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఇటీవల ముస్లింలపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయినా, అమెరికాలో కొందరు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే, పలు కఠిన నిర్ణయాలు తప్పవని భావించే వారు డొనాల్డ్ వెనుక నిలుస్తున్నారు.