: ఐఎస్ కు వెయ్యేనుగుల బలం!... మద్దతు ప్రకటించిన 42 ఉగ్రవాద సంస్థలు
ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పేరిట రంగ ప్రవేశం చేసిన ఉగ్రవాద సంస్థ ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యంపై భీకర దాడులకు తెగబడుతున్న ఐఎస్ ఉగ్రవాదులు, హింసలో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థ అగ్రరాజ్యం అమెరికాను కూడా భయపెట్టింది. తాజాగా ఈ సంస్థకు మరింత బలం చేకూరింది. విశ్వవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న 42 సంస్థలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ‘ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్’ పేరిట ప్రముఖ స్టాటిస్టిక్స్ సంస్థ ‘స్టాటిస్టా’... ‘ద ఇండిపెండెంట్’ పత్రిక కోసం రూపొందించిన మ్యాప్ ను పరిశీలిస్తే ఐఎస్ కు నానాటికీ పెరుగుతున్న బలాన్ని ఇట్టే చెప్పేయొచ్చు. ఐఎస్ తో కలిసి పనిచేసేందుకు 30 సంస్థలు ఇప్పటికే ప్రతినబూనగా, మరో 12 సంస్థలు మద్దతిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సదరు మ్యాప్ చెబుతోంది. ఐఎస్ కు మద్దతు ప్రకటించిన సంస్థల్లో బోకో హరామ్ కూడా ఉంది.