: జనవరి 1 నుంచి ఢిల్లీ రోడ్లపై షి'కారు' ఇక ‘రోజు విడిచి రోజు’!


ఢిల్లీలో కార్లను ‘రోజు విడిచి రోజు’ విధానం ద్వారా రోడ్లపైకి అనుమతించే పద్ధతి కొత్త ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య కార్లు తిరిగేందుకు అనుమతించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ, మొదటి దశలో భాగంగా జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పద్ధతి అమలులో ఉంటుందన్నారు. కారు నంబర్ చివరిలో ఉండే బేసి సంఖ్య లేదా సరిసంఖ్య ఆధారంగా ఈ కొత్త విధానం అమల్లోకి రానుందన్నారు. నంబర్ చివరలో బేసి సంఖ్య ఉన్న కార్లను బేసి సంఖ్య తేదీల్లో, సరిసంఖ్య ఉన్న కార్లను సరి సంఖ్య తేదీల్లోనే రోడ్లపైకి తిరిగేందుకు అనుమతిస్తామన్నారు. అయితే, ఆదివారాల్లో మాత్రం ఈ నిబంధన వర్తించదన్నారు. మహిళలు, వికలాంగులకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్త ఏడాది నుంచి అమలు కానున్న ఈ విధానంలో ద్విచక్రవాహనాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. కాగా, ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించే నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఢిల్లీ రోడ్లపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించే విషయమై ఈ కొత్త నిబంధనలను రూపొందించారు.

  • Loading...

More Telugu News