: ‘మీ కోసం’కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు!
పలు సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ‘మీ కోసం’ కార్యక్రమానికి హాజరుకాని హైదరాబాద్ జిల్లా స్థాయి అధికారులకు త్వరలో షోకాజ్ నోటీసులు అందనున్నాయి. సుమారు 45 మంది అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ విషయమై హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు నిర్వహించిన ‘మీ కోసం’కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ అడ్మినిస్ట్రేటివ్ అధికారి చంద్రావతిని ఆయన ఆదేశించారు. ఈ నోటీసులు అందుకున్న అధికారులు వారం రోజుల్లోగా స్పందించాలన్నారు. జిల్లా స్థాయి అధికారులకు బదులుగా జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. ఆయా అంశాలకు సంబంధించి కలెక్టర్ ప్రశ్నించినప్పుడు వారు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో రాహుల్ కొంత అసహనానికి గురయ్యారు.