: సంచలనం... పాక్ గూఢచర్యం వెనుక భారత రాజకీయ కోణం!
భారత సైన్యం రహస్యాలు తెలుసుకుని విధ్వంసం సృష్టించేందుకు పాక్ చేపట్టిన గూఢచర్యం వెనుక రాజకీయ కోణం ఉందా? ఈ విషయంలో కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ సంచలన విషయాన్ని కనుగొన్నట్టు 'మెయిల్ టుడే' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కేసులో నిందితుడిగా పట్టుబడ్డ సబర్ ఓ జాతీయ పార్టీలో కార్యకర్తగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. టీచరు వృత్తిలో ఉన్న సబర్ సైన్యం రహస్యాలను పాక్ ఉగ్రవాదులకు అందిస్తున్నాడన్న ఆరోపణలపై అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కేసు వెనక ఇంకెవరైనా రాజకీయ నేతలు ఉన్నారా? అన్న దిశగా కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కేసులో మరో సైనికుడిని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్ ఫ్యాంట్రీ డివిజన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఫరీద్ ఖాన్, రాజౌరీలో పలుమార్లు సబర్ ను కలుసుకున్నట్టు విచారణలో వెల్లడైంది.