: విమానం చక్రంలో కింగ్ కోబ్రా!
ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వీధులు, రైల్వే ట్రాక్ లు, ఎయిర్ పోర్ట్ రన్ వే పూర్తిగా జలమయమైన విషయం తెలిసిందే. అక్కడి క్రొకడైల్ పార్క్ లోని మొసళ్లు సైతం వరద నీటికి కొట్టుకుపోయి, జలమయమైన వీధుల్లోకి చేరడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడి రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ్వడంతో సిబ్బంది విమాన చక్రాలను శుభ్రం చేస్తుండగా ఒక కింగ్ కోబ్రా కనిపించింది. దాన్ని సురక్షితంగా బయటకు తీసి, విమానాశ్రయానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఐదు రోజుల పాటు మూతపడిన విషయం తెలిసిందే.