: ఈ దఫా కూడా హైదరాబాద్ లోనే, 17 నుంచి ఏపీ అసెంబ్లీ
ఈ నెల 17 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ దఫా కూడా హైదరాబాదులోనే సమావేశాలు జరుగుతాయని స్పీకర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను అమరావతి ప్రాంతంలో జరిపించాలని తొలుత స్పీకర్ కోడెల భావించినప్పటికీ, మౌలిక వసతుల లేమి కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, పట్టిసీమ, అమరావతికి వరదముప్పు తదితర అంశాలపై అధికార తెలుగుదేశం పార్టీని వైకాపా ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇసుక రీచ్ ల వ్యవహారంతో పాటు తెలుగుదేశం కార్యకర్తగా ఉన్న చింటూ, తన సొంత మేనమామను హత్య చేసిన అంశం, వైకాపా నేతలపై దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపైనా వైకాపా నిలదీయనుండగా, విపక్షాలకు గట్టిగా సమాధానం చెప్పాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, సభ ఎన్నిరోజులు సాగాలన్న విషయమై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నది కోడెల అభిమతంగా తెలుస్తోంది. కనీసం 5 రోజుల పాటు సభ జరుగుతుందని అంచనా.