: అప్పులిప్పించే యాప్ ను తయారు చేసిన ఎన్నారై టీనేజర్... ఇండియా కోసమేనట!
అతని పేరు గురుజ్యోత్ సింగ్. వయసు 17 సంవత్సరాలు. అతని మూలాలు అమృతసర్, ముంబైల్లో ఉన్నాయి. ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్ టన్ ప్రాంతంలో ఉంటున్నాడు. ఇండియాలో పేదల ఆర్థిక సమస్యలు, సూక్ష్మ రుణ సంస్థల ఆగడాల గురించి విని, సమస్యకు పరిష్కారంగా ఓ యాప్ ను తయారు చేశాడు. అది అందరి మన్ననలూ అందుకుంటోంది. ఇటీవల జీ-7 దేశాలకు చెందిన 14 నుంచి 18 ఏళ్ల యువత తమతమ ఆవిష్కరణలతో జర్మనీలో కలుసుకోగా, ఈ యాప్ గురించి తెలుసుకున్న జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, గురుజ్యోత్ ను ప్రత్యేకంగా కలిశారు కూడా. "అభివృద్ధి చెందిన దేశాల్లోని వ్యక్తులు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల అవసరానికి సూక్ష్మ రుణాలను అందించే ఆలోచన నుంచి వచ్చింది. ఇండియా వంటి ఎన్నో దేశాల్లో ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలను పొందలేకపోతున్నారు. అభివృద్ధి లేమి, వర్గాల మధ్య అంతరం ఇందుకు కారణం. ఒకవేళ బ్యాంకులు రుణాలిస్తున్నా, వడ్డీ రేట్లు అధికంగా ఉంటున్నాయి" అని గురుజ్యోత్ వివరించాడు. "ఈ యాప్ ను ఉపయోగించి, ప్రజలు తమ అవసరాలను తెలుపుతూ పోస్టులు చేయవచ్చు. మీరు చిన్న వ్యాపారులైతే, తయారు చేసే ప్రొడక్టులు, రైతులైతే పండించనున్న పంటల వివరాలు వంటి వాటిని పంచుకోవచ్చు. వాటిని చూసే అభివృద్ధి చెందిన దేశాల వారు మీ అవసరాలకు తగ్గట్టు, తక్కువ వడ్డీ రేట్లకు ఆఫర్లతో రుణాలిచ్చే అవకాశాలు పుష్కలం" అని పేర్కొన్నాడు. నేటి పోటీ ప్రపంచంలో ఈ తరహా యాప్ ల అవసరం ఎంతో ఉందని, ఈ యాప్ విజయవంతంపై తనకు సానుకూల దృక్పథం ఉందని చెబుతున్న గురుజ్యోత్ కు ఆల్ ది బెస్ట్.