: జైల్లో లగ్జరీకి సహారా అధినేత పెట్టిన ఖర్చు రూ. 1.23 కోట్లు!
బెయిలు కావాలంటే రూ. 5 వేల కోట్ల నగదు, మరో రూ. 5 వేల కోట్లకు చెక్కులను ఇవ్వాల్సిన సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతా రాయ్, తీహార్ జైల్లో లగ్జరీ గది నుంచి సాధారణ సెల్ కు మారారు. బెయిలు నిమిత్తం కావాల్సిన డబ్బు ఆయన చెల్లించే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు భావించిన తరువాత, ఆయన్ను ప్రత్యేక గది నుంచి మామూలు గదికి మార్చగా, తాను అనుభవించిన లగ్జరీ నిమిత్తం జైలుకు రూ. 1.23 కోట్లను ఆయన చెల్లించుకున్నారు. ఏసీ గది, ల్యాప్ టాప్ లు, ల్యాండ్ ఫోన్లు, పీఏ, వీడియో కాన్ఫరెన్స్ తదితర సౌకర్యాలను ఆయనకు కల్పించిన సంగతి తెలిసిందే. సహారా సంస్థ ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు అక్రమమని సెబీ తేల్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. లండన్ లో ఉన్న సహారా హోటళ్లను విక్రయించుకునేందుకు వీలుగా, దేశీయ, విదేశీ వ్యాపారవేత్తలతో చర్చలు జరుపుకునేందుకు సుబ్రతా రాయ్ కి జైలు గదిలో ప్రత్యేక వసతులు కల్పించిన సంగతి తెలిసిందే.