: చెన్నైలో సూర్యుడు కనిపించాడు... 20 రోజుల తర్వాత దర్శనమిచ్చిన భానుడు
తమిళనాడు రాజధాని చెన్నైని వరుణుడు ముంచెత్తాడు. రెండు దఫాలుగా విరుచుకుపడ్డ వాన దేవుడు నగరాన్ని నీట ముంచేశాడు. పలితంగా నగర జన జీవనం దుర్భరంగా మారింది. తొలి విడతలో ఓ మాదిరి నష్టాన్ని మిగిల్చిన వరుణుడు, రెండో దఫాలో మాత్రం బీభత్సం సృష్టించాడు. నగరం మొత్తం జలసంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో 20 రోజులుగా సూర్యుడు నగరవాసులకు ముఖం చాటేశాడు. ఎడతెరిపి లేని వర్షం, ఆకాశం మొత్తం మేఘావృతమైన నేపథ్యంలో 20 రోజులుగా చెన్నైలో అసలు భానుడి ఆనవాళ్లే కనిపించలేదు. తాజాగా నిన్నటి నుంచి కాస్తంత విశ్రమించిన వాన దేవుడు తెరిపి ఇచ్చాడు. దీంతో నేటి ఉదయం 20 రోజుల తర్వాత తొలిసారిగా చెన్నైవాసులకు సూర్యుడు దర్శనమిచ్చాడు. ఇదిలా ఉంటే రోజుల తరబడి స్తంభించిన రవాణా నేడు సాధారణ స్థితికి రానుంది. విమాన సర్వీసులతో పాటు రైల్వే సర్వీసులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కానున్నాయి.