: భారత్-పాక్ చర్చలు షురూ!...బ్యాంకాక్ లో జంజువాతో దోవల్ 4 గంటల సుదీర్ఘ భేటీ


భారత్, పాకిస్థాన్ ల మధ్య సుదీర్ఘకాలంగా నిలిచిన చర్చలు ఎట్టకేలకు మళ్లీ మొదలయ్యాయి. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, నాసిర్ ఖాన్ జంజువాలు ధాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ లో రహస్యంగా భేటీ అయ్యారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ తో కలిసి అజిత్ దోవల్ ఈ చర్చలకు వెళ్లగా, జంజువా కూడా పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అహ్మద్ చౌదరితో కలిసి చర్చల్లో పాల్గొన్నారు. దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో శాంతి, భద్రత, ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద తాజా పరిస్థితులు... తదితర అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. అత్యంత రహస్యంగా ప్రారంభమైన ఈ భేటీ ముగిసిన తర్వాత మాత్రం ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో దోవల్, జంజువాలు పేర్కొన్నారు. ఇటీవల ప్యారిస్ లో ఆత్మీయంగా పలకరించుకున్న ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు ప్రోటోకాల్ ను పక్కనబెట్టి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నిలిచిన జాతీయ భద్రతా సలహాదారుల చర్చలను పునరుద్ధరించాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే వేదికపై మాట్లాడుకున్న ఇద్దరు నేతలు తటస్థ వేదిక బ్యాంకాక్ అయితే బాగుంటుందని నిర్ణయించారట. నాటి మోదీ, షరీఫ్ ల మధ్య జరిగిన భేటీ... నిన్నటి దోవల్, జంజువాల చర్చలకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది.

  • Loading...

More Telugu News