: భేష్, ఆమ్లా, డివిలియర్స్...72 ఓవర్లలో 72 పరుగులు


సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా, వన్డే కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అత్యంత ఓపికను ప్రదర్శించి టెస్టు మజాను అభిమానులకు అందించారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు సౌతాఫ్రికా ఆటగాళ్లు అనితరసాధ్యమైన ఓపికను, పట్టుదలను ప్రదర్శించారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప విజయం సాధించే అవకాశం లేని టెస్టును డ్రా చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 267 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లెర్ చేసి టీమిండియా బ్యాటింగ్ అప్పగించడంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఎల్గర్ (4) ఆదిలోనే తడబడడంతో అశ్విన్ కు చిక్కాడు. దీంతో బావుమా (34)కు ఆమ్లా జత కలిశాడు. ఆమ్లా ఓపిగ్గా ఇన్నింగ్స్ ఆడడంతో బావుమా అప్పుడప్పుడు బ్యాట్ ఝుళిపించాడు. అతనిని కూడా అశ్విన్ పెవిలియన్ కు పంపడంతో ఆమ్లాకు డివిలియర్స్ జత కలిశాడు. వీరిద్దరూ టీమిండియా బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించారు. వీరి జోడీని విడదీసేందుకు కోహ్లీ ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ తో కూడా బౌలింగ్ చేయించాడు. అయినప్పటికీ ఆమ్లా, డివిలియర్స్ పట్టుదల ముందు టీమిండియా పప్పులుడకలేదు. దీంతో 203 బంతులు ఆడిన హషీమ్ ఆమ్లా మూడు ఫోర్ల సాయంతో 23 పరుగులు సాధించగా, తన సహజ శైలికి భిన్నంగా 91 బంతులు ఎదుర్కొన్న డివిలియర్స్ ఒకే ఒక్క ఫోర్ సాయంతో 11 పరుగులు చేయడం విశేషం. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లతో రాణించాడు. దీంతో 72 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News