: ఆ తాలిబన్ నేత బతికే ఉన్నాడట!
ఆఫ్గన్ తాలిబన్ నేత ముల్లా అఖ్తర్ మన్సూర్ చనిపోయినట్టు వచ్చిన వార్తలు 'శత్రువుల ప్రచారం' మాత్రమేనని, ఆయన బతికే ఉన్నాడని చెబుతూ మన్సూర్ మాట్లాడిన మాటలను తాలిబన్ వర్గాలు ఓ ఆడియో మెసేజ్ రూపంలో విడుదల చేశాయి. మొత్తం 16 నిమిషాలున్న ఆడియో ఫైల్ లో ఒంటికన్ను ఉగ్రవాది మన్సూర్ మాట్లాడుతూ, "పాకిస్థాన్ లోని క్వెట్టా సమీపంలోని కుల్చాక్ ప్రాంతంలో జరిగిన దాడిలో గాయపడ్డ నేను మరణించానని వచ్చిన వార్తలు అవాస్తవం. ఇది శత్రువుల ప్రచారం. ఎన్నో ఏళ్లుగా నేనసలు కుల్చాక్ ప్రాంతానికే వెళ్లలేదు" అని అన్నాడు. ఆఫ్గన్ నిఘా వర్గాలతో పాటు మరెంతో మంది మన్సూర్ తీవ్రంగా గాయపడి మరణించాడని, ఇది తాలిబన్ మిలిటెంట్లకు పెద్ద దెబ్బని వ్యాఖ్యానించారు. ఇప్పుడిక మన్సూర్ మరణించలేదని తెలుస్తుండటంతో అతన్ని మట్టుబెట్టేందుకు మరిన్ని ఆపరేషన్స్ జరుగనున్నాయని సమాచారం. తాలిబన్ నేత ఒమర్ మరణం తరువాత ఈ సంవత్సరం జూలై 31న మన్సూర్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.