: ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పండి: రామమందిరంపై శివసేన
తాను మరణించేలోగా అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరుతానని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను శివసేన స్వాగతించింది. తమ సొంత పత్రిక 'సామ్నా'లో రామజన్మభూమిపై సంపాదకీయం రాస్తూ, ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యే తేదీ చెప్పాలని కోరింది. "ఈ విషయంలో మోహన్ భగవత్ ఆలోచనలను స్వాగతిస్తున్నాం. అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారో ఆయన ప్రకటించాలి. వందలాది మంది రక్తతర్పణం చేసిన తరువాత కూడా ఓ గుడిని నిర్మించుకోలేకపోతే, వారు చేసిన త్యాగాలకు కారణం లేకుండా పోయినట్లవుతుంది" అని వ్యాఖ్యానించింది. ధైర్యం చేసి గుడిని నిర్మిస్తే, కోట్లాది మంది ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరింత ఉన్నతుడవుతాడని అభిప్రాయపడింది. కేవలం మైనారిటీ ప్రజల కోరికలను మాత్రమే ప్రభుత్వాలు తీరుస్తూ వస్తున్నాయని, అత్యధికుల కోరిక మేరకు గుడి నిర్మాణం తప్పనిసరని, ఇప్పుడు ఆలయాన్ని నిర్మించలేకుంటే, ఇక ఎప్పటికీ నిర్మించలేరని వెల్లడించింది.