: కర్నూలు నగరాభివృద్ధికి ఆస్ట్రేలియా అండ!
కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీల జాబితాలోకి చేరలేక, 'అమృత్'తో సరిపెట్టుకున్న కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సంకల్పించింది. బుధవారం నాడు నగరాన్ని పరిశీలించేందుకు అస్ట్రేలియా నుంచి అధికారుల బృందం రానుంది. నగరాన్ని చూసిన తరవాత, ఏ తరహా అభివృద్ధి చేయాలన్న విషయమై చంద్రబాబు సర్కారుతో ఆస్ట్రేలియా బృందం చర్చలు జరపనుంది. కాగా, నవ్యాంధ్ర రాజధాని అమరావతితో సమానంగా కర్నూలును డెవలప్ చేస్తామని ఇప్పటికే చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లులో ఉన్న 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎయిర్ పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ తదితరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఏపీ సర్కారు నిర్ణయించింది. ఓర్వకల్లు, కర్నూలు మధ్య కొత్త నగరం తయారవుతుందని భావిస్తున్న చంద్రబాబు సర్కారు, నగర పాలక సంస్థ పరిధిని సైతం విస్తరించాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగి, ఆస్ట్రేలియా సహకారం తోడైతే, కర్నూలు ఏపీలో మరో నగరంగా మారుతుందనడంలో సందేహం లేదు.