: వరద తగ్గినా... కళ్లముందు నరకమంటే ఇదే!


వరుణుడి బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నై నగరవాసుల కళ్లముందు నరకం కనిపిస్తోంది. అప్పటి వరకు ఉగ్రతాండవం చేసిన అడయార్ నది, గడచిన 24 గంటలుగా వర్షం పడకపోవడంతో కాస్తంత శాంతించింది. పలు ప్రాంతాల్లో మెడలోతు నిలిచిన నీరు సముద్రంలోకి వెళ్లిపోగా, వేలాది ఇళ్లు రెండడుగుల మేరకు బురదలో కూరుకుపోయాయి. ఆకలితో నిండిన కడుపులోకి ఏదైనా ఆహారం వేద్దామని బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజల కష్టాలను తమ లాభాలుగా మార్చుకోవాలన్న భావనతో వ్యాపారులు అమాంతం రేట్లను పెంచేశారు. రూ. 5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ రూ. 20కి అమ్ముతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక పాల ధర ప్యాకెట్ రూ. 100 వరకూ పలుకుతోంది. నగర వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఏటీఎంలు, పెట్రోలు బంకులు తెరచుకోగా, వాటి ముందు గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. బొంబాయి రవ్వ, గోధుమపిండి, బియ్యం, కందిపప్పు, కూరగాయలతో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ కు డిమాండ్ అధికంగా ఉంది. కాగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఎప్పుడైనా వర్షాలు కురవవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో, ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షం కురవకముందే ఇంట్లోకి ఆహార, నిత్యావసరాలు చేరవేసుకోవాలని ప్రజలు భావిస్తుంటే, ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మరోవైపు చెన్నైలో సర్వమూ కోల్పోయిన అభాగ్యులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతానికి పగటి పూట విమానాలను నడుపుతామని, పూర్తి స్థాయిలో విమానాశ్రయాన్ని తెరిచేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News