: వృత్తి ప్రభుత్వ టీచర్... చేసేది భారత సైన్యంపై గూఢచర్యం!
అతని పేరు సబర్. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ ప్రాంతంలో ప్రభుత్వ టీచర్. గౌరవనీయమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, ప్రభుత్వం అందిస్తున్న వేతనాన్ని తీసుకుంటున్న ఇతను చేసే అసలు పని... సైన్యం రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేయడం. గత వారంలో బీఎస్ఎఫ్ అధికారి అబ్దుల్ రషీద్, ఐఎస్ఐకి చెందిన కపైతుల్లాఖాన్ లను అరెస్ట్ చేసిన తరువాత విచారించిన అధికారులకు సబర్ గురించి తెలిసింది. దీంతో హైడ్రామా మధ్య సబర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటికి పోలీసులు వస్తున్నారన్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న సబర్, ఊరు దాటే దారి లేక, ఇంట్లోనే ఉండి బయటి నుంచి తాళం వేయించుకున్నాడు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరిన సమయంలో స్థానికులు వారిని అడ్డుకున్నారు కూడా. ఈ లోగా ఇంటి పైకప్పు ఎక్కిన సబర్, పారిపోయే ప్రయత్నమూ చేశాడు. అదనపు బలగాల సాయంతో సబర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని ఇంట్లో సోదాలు జరిపి కపైతుల్లాఖాన్ తో ఫోన్ సంభాషణలు, అతనిచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ అధికారి నుంచి సైన్యానికి సంబంధించిన పలు రహస్యాలను సేకరించిన సబర్ వాటిని కపైతుల్లాఖాన్ కు అందించాడని పోలీసులు తెలిపారు.