: దిగ్విజయ్ సింగ్ పై భోపాల్ లో చీటింగ్ కేసు
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై భోపాల్ లో చీటింగ్ కేసు నమోదైంది. ఆయనతో పాటు నాటి ఆయన మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన రాజా పటారియా, ఆర్ కేడీఎఫ్ అనే విద్యా సంస్థ ఛైర్మన్ సునీల్ కపూర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 1993-2003 కాలంలో దిగ్విజయ్ మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఆర్ కేడీఎఫ్ విద్యా సంస్థ 2000-01, 2001-02 విద్యా సంవత్సరాల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు చేపట్టిందని ఆరోపిస్తూ, విద్యాశాఖ అధికారులు ఆ సంస్థకు రూ.24 లక్షల జరిమానా విధించారు. డిగ్గీ, పటారియాలు నిబంధనలను అతిక్రమించి ఈ భారీ జరిమానాను రూ.2.5 లక్షలకు కుదించారని స్థానిక జర్నలిస్ట్ రాధావల్లభ్ శారదా ఫిర్యాదు చేశారు. దాంతో ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ లు 420, 467, 120 (బీ) కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.