: బెజవాడ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడినట్టే!... దుర్గ గుడి, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్లకు నేడు శంకుస్థాపన
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో ట్రాఫిక్ చిక్కులతో జనం సతమతమవుతున్నారు. ఈ ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టాలంటే ప్రధానంగా దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మించాలని ఏళ్ల తరబడి వినిపిస్తున్న ప్రతిపాదనపై నిన్నటిదాకా స్పందించిన ప్రభుత్వాలే లేవు. అయితే రాష్ట్ర విభజన, నవ్యాంధ్ర నూతన రాజధానిగా విజయవాడకు సమీపంలోని ప్రాంతాన్ని ఎంచుకోవడం దరిమిలా విజయవాడలోని ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. బెజవాడ ఎంపీ కేశినేని నాని చొరవతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఇప్పటికే పక్కా ప్లాన్ తో టెండర్లను ముగించింది. నేటి ఉదయం దుర్గ గుడి ఫ్లైఓవర్ తో పాటు నగరంలో మరో ప్రధాన కూడలి బెంజి సర్కిల్ వద్ద కూడా ఫ్లైఓవర్ పనులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాక విజయవాడ-మచిలీపట్నం మధ్య రహదారిని నాలుగు లేన్లుగా మార్చే పనులను కూడా గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ పనులపై నిన్న సమీక్షించిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దుర్గ గుడి ఫ్లైఓవర్ ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే, మరో ఆరు నెలల తర్వాత విజయవాడ నగర ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు ఎదురుకావన్న మాట.