: సంపూర్ణ మద్య నిషేధంపై నితీశ్ కుమార్ 'యూ టర్న్'!
వచ్చే ఏప్రిల్ 1 నుంచి బీహార్ లో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని రెండు వారాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రకటించిన నితీశ్ కుమార్ వెనక్కు తగ్గారు. కేవలం దేశవాళీ మద్యంపైనే నిషేధం అమలవుతుందని బీహార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు ఇండియాలో తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్) ధరలను పెంచి, సామాన్యులు కొనుగోలు చేయకుండా దూరం జరిగేలా చూడాలన్నది తమ అభిమతమని తెలిపింది. "మద్యం మరణానికి దారి తీస్తుంది. ఏదైనా ప్రభుత్వం మరణాన్ని అమ్ముతుందా?" అని ప్రశ్నించిన బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి అబ్దుల్ జలిల్ మస్తాన్ మాత్రం, అన్ని రకాల మద్యం ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేసేందుకు యత్నిస్తామని, అయితే అది దశలవారీగా జరుగుతుందని తెలిపారు. కాగా, తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహారులో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని నితీశ్ కుమార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.