: పాక్ పర్యటనకు సుష్మా... మోదీ, నవాజ్ ల భేటీ ఫలితమేనా?
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ త్వరలో దాయాదీ దేశం పాకిస్థాన్ లో పర్యటించనున్నారా? అంటే, అవుననే అంటున్నాయి విదేశాంగ శాఖ వర్గాలు. మొన్న ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు ఆత్మీయంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. అంతేకాక అక్కడే పక్కపక్కనే స్నేహితుల్లా కూర్చున్న వారిద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారు. వారేం చర్చించుకున్నారో బయటకు వెల్లడి కాలేదు కానీ, ఆ భేటీ ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణానికి నాందీ పలికిందని చెప్పొచ్చు. ఈ నెల 8న ఆఫ్ఘానిస్థాన్ కు ప్రాంతీయ సహకారంపై 14 దేశాల మంత్రుల స్థాయి సమావేశాలు పాకిస్థాన్ లో జరగనున్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు పాక్ నుంచి నిన్న ఆహ్వానం అందింది. అయితే సుష్మా ఈ సదస్సుకు పాక్ వెళతారా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాల నేపథ్యంలో సుష్మా పాక్ పర్యటనకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరి ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అన్నది శుక్రవారం నాడు తేలిపోతుందని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సుష్మా పాక్ పర్యటన కార్యరూపం దాలిస్తే మాత్రం ఇరు దేశాల మధ్య కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.